: 'మ్యాగీ' నూడుల్స్ కు మహారాష్ట్ర, గోవాలో క్లీన్ చిట్


ఇన్ స్టంట్ గా తినే 'టు మినిట్స్ మ్యాగీ' నూడుల్స్ లో ఆహార భద్రతా ప్రమాణాలు లోపించాయన్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర, గోవాల్లో జరిపిన పరీక్షల్లో మ్యాగీకి క్లీన్ చిట్ లభించింది. తాము పరీక్షలు జరిపిన నూడుల్స్ నమూనాల్లో ఎలాంటి ప్రతికూల నివేదికలు రాలేదని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. "కొన్ని నూడుల్స్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయించాము. ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదు. ఈ విషయంపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ హర్షదీప్ కాంబ్లేతో మాట్లాడాను కూడా" అని మహారాష్ట్ర ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గిరీష్ బాపత్ తెలిపారు. దాదాపు 8 నుంచి 10 మ్యాగీ నూడుల్స్ నమూనాలకు పరీక్షలు చేయించామని చెప్పారు. నూడుల్స్ లో ఇంకా రకరకాల నమూనాలకు మరోసారి పరీక్షలు చేయిస్తామని, ఏదైనా వ్యతిరేకంగా నివేదిక వస్తే నెస్లేపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా మ్యాగీ నూడుల్స్ వినియోగానికి సురక్షితమేనని తేలినట్టు గోవా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక ప్రొడక్షన్ యూనిట్, రిటైల్ స్టోర్స్ లోని మ్యాగీ పాకెట్లను పరీక్షలు చేయించామని, అందులో సోడియం గ్లుటామాటే, లీడ్ లెవల్స్ పరిమిత స్థాయుల్లో ఉన్నట్టు చెప్పారు. ఇదిలాఉంటే ఢిల్లీలో మ్యాగీ నూడుల్స్ పై 15 రోజుల పాటు నిషేధం విధించారు.

  • Loading...

More Telugu News