: నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల ఓదార్పు యాత్ర మరోసారి ప్రారంభంకానుంది. ఈ నెల 9 నుంచి నల్లగొండ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్రను షర్మిల చేపట్టనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన పలువురి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తారు. 9న ప్రారంభమయ్యే ఈ యాత్ర 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా, మొత్తం 17 కుటుంబాలను షర్మిల ఓదారుస్తారు. భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామంలో యాత్ర ప్రారంభమవుతుంది. భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతుంది. ఈ వివరాలను వైకాపా ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ లు వెల్లడించారు.