: థరూర్ తో ఎయిమ్స్ డైరెక్టర్ లోపాయికారీ ఒప్పందం: సునంద ‘అటాప్సీ’ వైద్యుడు
తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మరణం కేసు నుంచి బయటపడేందుకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్ నానా తంటాలు పడుతున్నారట. ఈ క్రమంలో ఆయన నిబంధనలను అతిక్రమిస్తూ అక్రమ మార్గాలను కూడా ఆశ్రయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ మేరకు సునంద పుష్కర్ భౌతిక కాయానికి శవ పరీక్ష నిర్వహించిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ సుధీర్ గుప్తా ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఎయిమ్స్ అధ్యక్షుడు జేపీ నద్దాకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. సునంద మరణం సహజమైనదేనని నివేదిక ఇవ్వాలని శవ పరీక్ష చేసిన తమ బృందంపై ఎయిమ్స్ డైరెక్టర్ ఎంసీ మిశ్రా ఒత్తిడి చేశారని గుప్తా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థరూర్ తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మిశ్రా ఈ తరహాలో తమపై ఒత్తిడి తెస్తున్నారని కూడా గుప్తా ఆరోపించారు. థరూర్, మిశ్రాల మధ్య ఒప్పందానికి వారి మధ్య నడిచిన ఈ-మెయిళ్లే సాక్ష్యమని కూడా గుప్తా వాదిస్తున్నారు. అక్రమాలపై ఫిర్యాదు చేసిన గుప్తాపై కేంద్ర మంత్రి ఇప్పటిదాకా స్పందించకపోగా, ఎయిమ్స్ మేనేజ్ మెంట్ మాత్రం గుప్తాకు ట్రాన్స్ ఫర్ ను బహుమానంగా ఇచ్చింది. గుప్తా ఆరోపణలు వాస్తవవిరుద్ధమని ఎయిమ్స్ ప్రకటించింది. అంతేకాక గుప్తాను ఫోరెన్సిక్ విభాగం చీఫ్ పదవి నుంచి తప్పిస్తూ ఆ పోస్టును మరో వైద్యుడు డీఎన్ భరద్వాజ్ కు అప్పగించింది.