: నేతల్లో అవినీతికి 'టెస్టోస్టిరాన్' కారణమా?
టెస్టోస్టిరాన్... పురుషుల్లో ప్రధాన సెక్స్ హార్మోన్ గా దీన్ని పరిగణిస్తారు. ఈ హార్మోన్ పై స్విట్జర్లాండ్ లాజన్నే యూనివర్శిటీ బృందం పరిశోధన చేపట్టి ఆసక్తికర అంశం వెల్లడించింది. టెస్టోస్టిరాన్ ఎక్కువగా కలిగివున్న రాజకీయనేతలే అవినీతికి పాల్పడే అవకాశాలు అధికమని వర్శిటీ పరిశోధకులు అంటున్నారు. ప్రొఫెసర్ జాన్ ఆంటోనకిస్ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం ఇందుకోసం 718 మంది విద్యార్థులపై అధ్యయనం చేపట్టింది. తొలుత వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిని నమోదు చేశారు. అనంతరం, వారిని రెండు గ్రూపులుగా విభజించి, 'డిక్టేటర్ గేమ్' పేరిట కొందరిని నాయకులుగా, కొందరిని అనుచరులుగా పేర్కొన్నారు. ఇప్పుడు, నాయకులకు కొంత డబ్బు ఇచ్చి, ఆ సొమ్మును అనుచరులకు పంచిపెట్టమని చెప్పారు. సమానంగా పంచాల్సిన పనిలేదని, ఇష్టం వచ్చిన రీతిలో పంపకం చేయవచ్చని స్పష్టం చేశారు. ఈ గేమ్ అనంతరం ఆసక్తికర వివరాలు తెలుసుకున్నారు. నాయకులు తమ వద్ద ఎక్కువ డబ్బు ఉంచుకుని, మిగతాది అనుచరులకు పంచారు. వారిలో టెస్టోస్టిరాన్ అధికంగా ఉన్నవారైతే, ఇంకాస్త ఎక్కువ డబ్బును తమవద్దే అట్టిపెట్టుకుని, మిగిలిన కాస్త సొమ్మును అనుచరులకు ఇచ్చారట. తద్వారా, అవినీతికి, టెస్టోస్టిరాన్ హార్మోన్ కు లింకు ఉందని జాన్ అండ్ కో ఓ అభిప్రాయానికొచ్చేసింది.