: అసెంబ్లీలో మీటింగ్ పెట్టుకున్న రేవంత్... బయటకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించిన మార్షల్స్
ఈ ఉదయం ఏసీబీ కోర్టు అనుమతితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలోని కమిటీ హాల్ లో టీడీపీ ఎమ్మెల్యేలతో రేవంత్ మీటింగ్ పెట్టుకున్నారు. మరోవైపు, ఓటు వేసి అరగంటలోగా రావాలని పోలీసులు ముందే రేవంత్ కు సూచించారు. అయితే ఎంత సేపటికీ రేవంత్ బయటకు రాకపోవడంతో పోలీసులు సైతం అసహనానికి గురయ్యారు. మరోవైపు, ఎన్నికలు జరుగుతుండగా సమావేశం ఎలా పెట్టుకుంటారని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని ఎన్నికల పరిశీలకుడు అదర్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, రంగంలోకి దిగిన మార్షల్స్ రేవంత్ ను బయటకు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. అనంతరం రేవంత్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.