: మరింతగా పెరగనున్న బంగారం ధర!
గత రెండు వారాలుగా తగ్గుతూవస్తున్న బంగారం ధరలు ఈ వారంలో మరింతగా పెరగవచ్చని నిపుణులు వ్యాఖ్యానించారు. 3వ తేదీన యూరప్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను సవరించనుండడం, ఆపై 4న బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సమీక్ష, 5న అమెరికాలో ఉద్యోగ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో, ఇవన్నీ బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేయనున్నాయని కమోడిటీ వెబ్ సైట్ కిట్కో న్యూస్ సర్వేలో విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో పాటు చైనా మార్కెట్ పతనం కొనసాగుతుండడంతో, ఇన్వెస్టర్ల సంపద బులియన్ వైపు తరలే అవకాశాలున్నాయని కూడా భావిస్తున్నారు. వాస్తవానికి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో గోల్డ్ సేల్స్ గత పక్షం రోజుల్లో తగ్గుతూ వచ్చాయి. మే 29తో ముగిసిన వారాంతానికి పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 205 తగ్గి 26,900కు చేరింది. వెండి ధర కిలోకు రూ. 550 తగ్గి 38,765 వద్ద కొనసాగాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో ధర 1 శాతం క్షీణించి 1189 డాలర్లకు చేరింది.