: 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారు: ఎర్రబెల్లి
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని వారి పార్టీలోని వారే భావిస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ మంత్రుల్లో తెలంగాణను వ్యతిరేకించిన వారు, అమరవీరుల స్థూపం వద్దకు రాని వారు కూడా ఉన్నారని... ఇది తెలంగాణ వాదులను బాధిస్తోందని తెలిపారు. కేసీఆర్ కు దమ్ముంటే శాసనసభను రద్దు చేయాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య విలువలను కేసీఆర్ తొక్కిపెట్టాలని చూస్తున్నారని... అది ఆయనకే సమస్యగా మారుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ఐదో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడిస్తేనే, అమరవీరుల ఆత్మలకు శాంతి కలుగుతుందని ఎర్రబెల్లి అన్నారు. ఆత్మసాక్షి ప్రకారమే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు వేయాలని సూచించారు.