: మ్యాగీపై దేశవ్యాప్త నిషేధం!
'టూ మినిట్ నూడుల్స్'గా భారతీయులకు సుపరిచితమైన నెస్లే 'మ్యాగీ'పై దేశవ్యాప్త నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాగీ నూడుల్స్ లో హానికారక రసాయనాలు ఉన్నాయన్న నివేదిక కేంద్రానికి అందింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా) తుది నిర్ణయం తీసుకునే ముందు మరోసారి శాంపిల్స్ పరీక్షించాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జరిపించిన పరీక్షల్లో ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు ఉన్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఆహార పదార్థాల్లో సీసం పరిమాణం 0.01 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్)కు పరిమితం కాగా, మ్యాగీలో ఇది ఏకంగా 17 పీపీఎం ఉండడం షాక్ కలిగిస్తోంది. దీంతో పాటు గ్లుటమేట్ సైతం నిర్దేశిత పరిమాణానికి మించి ఉందని రిపోర్టులు వెల్లడించాయి. ఇప్పటికే యూపీలో మ్యాగీ అమ్మకాలను నిలిపివేశారు. కాగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ పరీక్షల తరువాత రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని నిర్ధారణ అయితే, ఇక నిషేధం విధించక తప్పదని అధికారులు వెల్లడించారు.