: ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు: మోదీ
ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైందని, ఏడాది గడచినా కాంగ్రెస్ వాళ్లు ఆ పరాభవాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు వారిని శిక్షించారని అన్నారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారని భావించామని, కానీ, అలాంటిదేమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమని విపక్షాలు విమర్శిస్తుండడంపై ఆయన స్పందనను కోరగా... కార్పొరేట్ వర్గాలేమో తమకు సర్కారు నుంచి ఏమీ సాయం అందడం లేదని వాపోతున్నాయని సమాధానమిచ్చారు. దేశ సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయని స్పష్టం చేశారు.