: 21 ఏళ్లు సేవ చేశాను... ఈ ఒక్క సిరీస్, ప్లీజ్!: చందర్ పాల్ అభ్యర్థనకు విండీస్ ససేమిరా
"రెండు దశాబ్దాలుగా విండీస్ క్రికెట్ కు ఎంతో సేవ చేశాను. ఈ ఒక్క సిరీస్ ను ఆడనివ్వండి. గౌరవంగా ఆట నుంచి తప్పుకుంటాను. విండీస్ క్రికెట్ అభిమానుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొనైనా టెస్టు జట్టులోకి తీసుకోండి" అని క్రికెటర్ చందర్ పాల్ ఎంతగా ప్రాధేయపడ్డా విండీస్ క్రికెట్ బోర్డు మనసు కరగలేదు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ లో తనను ఎంపిక చేస్తే, దాని తరువాత క్రికెట్ కు వీడ్కోలు పలకాలన్నది ఆయన అభిప్రాయం. ఈ మేరకు కోచ్ ఫిల్ సిమన్స్ కు వాట్స్ యాప్ వేదికగా సమాచారం పంపాడు. అయితే, గత సిరీస్ లో నీకు మద్దతుగా నిలిచానని గుర్తు చేసిన సిమన్స్, ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదని స్పష్టం చేశాడు. కాగా, ఇప్పటివరకూ 164 టెస్టులాడిన పాల్ 11,867 పరుగులు చేశాడు. మరో 87 పరుగులు చేసి వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న బ్రియాన్ లారా (11,953 పరుగులు) రికార్డును తన పేరిట లిఖించుకోవాలన్నది చందర్ పాల్ అభిమతం. అయితే, ఈ కోరిక తీరేలా లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక కాకుంటే, ఇక భవిష్యత్తులో పాల్ మరోసారి టెస్టు క్రికెట్ ఆడే అవకాశాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఇటీవల ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సిరీస్ లలో మూడేసి మ్యాచులాడిన చందర్ పాల్ 11 ఇన్నింగ్స్ లలో 183 పరుగులే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో కుర్రాళ్లను ప్రోత్సహించాలని విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది.