: అక్కడ కరెన్సీతో పెద్దగా పని ఉండదట!
ఆస్ట్రేలియాలో కరెన్సీతో పెద్దగా పని ఉండదట! ఎందుకంటే, అక్కడ కార్డులతోనే మొత్తం పని కానిచ్చేస్తారట. ఆస్ట్రేలియాలో 82 శాతం లావాదేవీలు క్రెడిట్, డెబిట్ కార్డులతోనే జరుగుతాయట. ఎంతో అవసరం అయితేనే తప్ప క్యాష్ క్యారీ చేయరు. ప్రస్తుతం ఉన్న వృద్ధతరానికి కరెన్సీపై మమకారం చావడం లేదని, నేటితరం మాత్రం మొత్తం లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే జరుపుతోందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఆస్ట్రేలియా ప్రతి ఏటా 66 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ నోట్లను ఏటీఎంల నుంచి తగ్గిస్తూ వస్తోందట. కరెన్సీ వినియోగంపై 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బిజినెస్' చేపట్టిన సర్వేలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. డెన్మార్క్ కూడా ఆస్ట్రేలియా బాటపట్టింది. 'త్వరలోనే కరెన్సీ రహిత డెన్మార్క్ ను చూడగలం' అంటూ ఆ దేశం ఘనంగా ప్రకటించింది. నెల వారీ ఖర్చులకు బడ్జెట్టును రూపొందించుకునేందుకు యాప్ లు అందుబాటులో ఉండడంతో అమెరికాలో కూడా కార్డులనే వినియోగిస్తున్నారట. గతంలో కార్డు లావాదేవీల వల్ల ఇబ్బందులు తలెత్తేవి. ఇప్పుడు ప్రైవసీ పాలసీల కారణంగా ఆన్ లైన్ పేమెంట్స్ విషయంలో వివాదాలు కనుమరుగయ్యాయి. దీంతో లావాదేవీల్లో కరెన్సీ నోట్ల కంటే కార్డులపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. దీంతో భవిష్యత్ లో దేశ విదేశాల్లో పర్యటించేటప్పుడు కూడా కరెన్సీ కాకుండా, కార్డు పట్టుకెళ్లడం సులభంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కార్డులపై లావాదేవీలు పెంచడం వల్ల, నకిలీ కరెన్సీకి చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్డుల వినియోగం వల్ల కరెన్సీ కనుమరుగైనా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.