: నిన్నెవరైనా వేధిస్తే మాకు సంబంధం లేదు: ముస్లిం యువతిపై వివక్ష చూపిన ముంబై హౌసింగ్ సొసైటీ
"నువ్వు ముస్లింవైన కారణంగా, నిన్నెవరైనా వేధిస్తే... బిల్డర్, బ్రోకర్, ఫ్లాట్ ఓనర్లకు ఎవరికీ సంబంధం లేదని అగ్రిమెంటు రాస్తేనే ఇల్లిస్తాం" అని ఓ ముస్లిం ఉద్యోగినిపై వివక్ష చూపిన ఘటన ముంబైలో జరిగింది. ఈ ఘటనపై ఆమె మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. కమ్యూనికేషన్ ప్రొఫెషన్లో ఉన్న 25 ఏళ్ల మిస్బా ఖాద్రి, మరో ఇద్దరు హిందూ మహిళా ఉద్యోగినులతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకుంది. దీనికోసం ముంబై పరిధిలోని వడాలాలో ఉన్న సాంఘ్వి హైట్స్ లోని ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. ఇంట్లో చేరేందుకు ఒక రోజు ముందు ముస్లింలు తమ అపార్టుమెంటులో వద్దంటూ, హౌసింగ్ సొసైటీ అభ్యంతరం చెప్పింది. మిగిలిన ఇద్దరు మహిళలు ఇచ్చిన భరోసాతో వారి షరతులకు ఒప్పుకున్న ఖాద్రి అప్పటికి ఇంట్లో చేరినా, వారం రోజుల్లో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. మిస్బా ఖాద్రి తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలనీ, లేకుంటే బయటకు గెంటేస్తామని రెంటల్ ఏజెంట్ బెదిరించాడు. ఖాద్రీతో పాటు మిగిలిన ఇద్దరు కూడా ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే, మొత్తం ఘటనపై సాంఘ్వీ హైట్స్ సూపర్ వైజర్ రాజేష్ స్పందిస్తూ, "ఆమె ఖాళీ చేసిన విషయాన్ని బ్రోకరును అడగాలని, తాము ముస్లింలను ఉండనిస్తామని" తెలిపారు.