: వైకాపా పుట్టుకే అవినీతి పుట్టుక... ఏ ఒక్కర్నీ వదలను: చంద్రబాబు


మహానాడులో వైకాపాపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆ పార్టీ పుట్టుకే అవినీతి పుట్టుక అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పట్నుంచో అధికారంలో ఉన్న టీడీపీకి ఇంతవరకు సొంత టీవీ చానల్ కానీ, పేపర్ కానీ లేవని... కానీ, ఆ అవినీతి పార్టీకి మాత్రం పేపర్ ఉందని, చానల్ ఉందని ఎద్దేవా చేశారు. ఇవన్నీ అవినీతి డబ్బుతోనే పెట్టారని దుయ్యబట్టారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, దోపిడీ చేశారో... వారిని ఉపేక్షించమని... ఆ అవినీతి డబ్బునంతా కక్కించి, ప్రజల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్పారు. ప్రజల కోసం నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టును వాళ్ల స్వార్థం కోసం అడ్డుకునేందుకు ప్రయత్నించారని... కానీ, అక్కడ ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో వెనుదిరిగారని పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మళ్లీ రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం జరగకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని, కోర్టులకు వెళుతూ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు ఎర్రచందనం స్మగ్లింగ్ తో సంబంధాలున్నాయని... అందుకే ఈ విషయంపై వాళ్లు మాట్లాడటం లేదని... స్మగ్లింగ్ తో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News