: ఎయిర్ ఇండియా విమానాన్ని ఆపేసిన ఎలుకలు!


ఎయిర్ ఇండియా నడుపుతున్న ఎ-320 విమానంలో ఎలుకలు కనిపించడంతో లెహ్ విమానాశ్రయంలో దాన్ని నిలిపివేశారు. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉండే లెహ్ విమానాశ్రయంలో ఎలుకల నివారణకు ఉపయోగపడేలా పొగ పెట్టే యంత్రాలు లేకపోవడంతో ఆ విమానాన్ని అక్కడే ఉంచారు. నేడు మరో విమానం ద్వారా యంత్రాలను అక్కడకు పంపనున్నట్టు ఏఐ వర్గాలు తెలిపాయి. ఒక విమానంలో ఎలుక కనిపించిందంటే, ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసి పొగ పెట్టి వాటిని సంహరించి అన్ని రకాల వైర్లు, టెక్నాలజీని మరోసారి పరీక్షించేదాకా విమానాన్ని టేకాఫ్ చెయ్యనివ్వరు. ఎలుకలు ఒక్క వైరును కొరికినా, విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోయి పెను ప్రమాదమే జరుగుతుంది. లెహ్ విమానాశ్రయం కొండల మధ్య ఉండడంతో, సూర్యుడు ఉదయించిన అరగంట తరువాత మాత్రమే ల్యాండింగునకు అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం తరువాత గాలుల తీవ్రత కారణంగా విమానాశ్రయాన్ని మూసివేస్తారు. విమానాల్లో ప్రయాణికులు తినుబండారాలను వదిలి వేయడంతోనే ఎలుకలు వస్తుంటాయని, ముఖ్యంగా ఆహారాన్ని లోడ్ చేసే సమయంలో ఇవి విమానాల్లోకి చేరుతుంటాయని, ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉందని అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలుక కనిపించినా, వెంటనే దాన్ని దింపేసి పొగ పెట్టి కనీసం రెండు గంటల పాటు విమానం తలుపులు సీజ్ చేయాల్సి వుంటుందని వివరించారు.

  • Loading...

More Telugu News