: గంటకు రూ.80తో అద్దెకారు మీరే నడుపుకోవచ్చు
సొంత డ్రైవింగ్ చేసుకునే వారికి కార్లను అద్దెకిచ్చే 'జూమ్‌కార్ డాట్‌కామ్' సంస్థ తన సేవలను హైదరాబాదులో అందుబాటులోకి తెచ్చింది. చాలా సులువుగా తమ వద్ద కార్లను బుకింగ్ చేసుకోవచ్చని, వెబ్ సైట్లో డ్రైవింగ్ లైసెన్స్ అప్ లోడ్ చేసి కారును అద్దెకు పొందవచ్చని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రెగ్ మోరాన్ వివరించారు. ఫోర్డ్ ఫిగో నుంచి మహీంద్రా ఎక్స్‌యువి వరకు 30 కార్లను హైదరాబాదీల కోసం సిద్ధం చేశామని, ప్రజల స్పందన బట్టి వచ్చే సంవత్సరం వ్యవధిలో వీటి సంఖ్యను వెయ్యికి పెంచుతామని వివరించారు. 2016లో ఏపీ రాజధాని అమరావతికి విస్తరిస్తామని తెలిపారు. తమ వద్ద అద్దెను గంటలవారీగా లెక్కిస్తామని, ఎంచుకునే కారును బట్టి గంటకు రూ. 80 నుంచి క. 140 వరకు చార్జి చేస్తామని, కనీసం 4 గంటలకు అద్దె వసూలు చేస్తామని పేర్కొన్నారు. బేసిక్ అద్దె కింద గంటకు పది కిలోమీటర్లు తిరగవచ్చని, ఇందులో ఇంధనం, బీమా చార్జీలు కలిపే ఉంటాయని చెప్పారు. అదనంగా తిరిగే కిలోమీటర్‌కు 12-14 రూపాయల వరకు చార్జి చేస్తామని తెలిపారు. కస్టమర్లు రోజులు, వారాలు, నెలల చొప్పున అద్దెకు తీసుకోవచ్చని, ఒక్కోదానికి ఒక్కో రకమైన టారిఫ్ ఉంటుందని తెలిపారు. ప్రారంభ ఆఫర్ లో భాగంగా తొలి సర్వీసుపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని వివరించారు.