: 'సుమతీ శతకం'లోని ఆ పద్యం అక్కడ నిజమైంది!
ఐకమత్యాన్ని సూచిస్తూ సుమతీ శతకంలోని ఓ పద్యాన్ని ప్రతి ఒక్కరమూ చదువుకున్నాం. అచ్చం అలాంటి సంఘటనే కెన్యాలోని మసాయిమరా జాతీయ పార్క్ లో చోటు చేసుకుంది. ఈ పార్కులో చార్లిస్ కొమిన్ అనే మాజీ సైనికాధికారి పర్యటిస్తుండగా, ఆసక్తికర సన్నివేశం కనిపించింది. దీనిని ఆయన తన కెమేరాలో బంధించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో విశేషమైన ఆదరణ పొందుతోంది. జాతీయ పార్కులో ఓ సింహం మంచి ఆకలి మీద వేటకు బయల్దేరింది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుండగా, దానికి ఓ అడవి దున్నల గుంపు కనిపించింది. దీంతో ఈ పూటకు పండగే అని భావించింది సింహం. దున్నలకు కాస్త దూరంలో ఓ పిల్ల దున్న కనిపించింది. దాని మెడపట్టుకుని లాక్కుపోదామని సింహం అనుకునేలోపు, ఆ అడవిదున్నలు దానిని చూసేశాయి. అంతే, సింహం మీదకి దూసుకొచ్చాయి. దీంతో ఆకలి మాట దేవుడెరుగు, ప్రాణం దక్కితే చాలు అనుకున్న సింహం చటుక్కున చెట్టెక్కింది. అయితే చెట్లు ఎక్కడంలో చిరుత అయితే నేర్పరి కానీ, సింహం కాదుకదా, అందుకే చెట్టుమీద అది ఎక్కువ సేపు ఉండలేకపోయింది. దీంతో చటుక్కున కిందికి దూకి వాటికి దూరంగా పారిపోయింది. '... బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ' అని గతంలో చెప్పిన మాటలు ఇలా నిజమయ్యాయి.