: పట్టిసీమ మంచిదే... అయితే, అందులో అవినీతి ఉందా? లేదా? అన్నది మాత్రం చూడాలి: సినీ నటుడు శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏకం కావాలని సినీనటుడు శివాజీ పిలుపునిచ్చారు. రాజకీయాల నేపథ్యంలో, ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం మానేసి... ప్రత్యేక హోదా కోసం కలసి పోరాడాలని అన్నారు. దీని కోసం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో జేఏసీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేయడం వల్ల తన ఉనికినే కోల్పోయిందని... ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నేతలు కూడా పోరాటం చేస్తామని అంటున్నారని... ఈ నేపథ్యంలో, వారిని కూడా కలుపుకుపోవాలని అన్నారు. టీడీపీ, వైకాపాలు ప్రత్యేక హోదా విషయంలో రాజకీయాలు మానుకోవాలని సూచించారు. హోదా కోసం ప్రతి ఆదివారం ధర్నాలు చేపట్టాలని... జాతీయ రహదార్లను దిగ్బంధించాలని, రైళ్ల రాకపోకలను అడ్డుకోవాలని చెప్పారు. అయితే, ఎలాంటి ఆస్తి నష్టాలకు పాల్పడరాదని సూచించారు. ఈ నిరసన కార్యక్రమాలు కూడా కేవలం ఆదివారాలు మాత్రమే చేపట్టాలని... మిగిలిన రోజుల్లో కార్యాలయాలు, విద్యాసంస్థలు పనిచేసేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పట్టిసీమ ప్రాజెక్టు చాలా మంచిదని... దీని వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని డెల్టా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందేమో అన్న విషయాన్ని మాత్రం కచ్చితంగా గమనించాలని అన్నారు.