: మోదీ ఏడాది పాలనలో తగ్గిన అంబానీల ప్రాభవం, దూసుకెళ్లిన అదానీ!


కేంద్రంలో నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి ఏడాది గడిచింది. ఈ సంవత్సర కాలంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 10 లక్షల కోట్లు పెరిగింది. ఇదే సమయంలో ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల సంస్థల ప్రాభవం గణనీయంగా పడిపోతే అదానీ దూసుకెళ్లారు. అంబానీ గ్రూపు సంస్థలతో పాటు ఐటీసీ, ఎల్అండ్ టీ గ్రూపులు సైతం తమ మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి. అదానీతో పాటు టాటాలు, భారతీ, హెచ్ డీఎఫ్సీ, సన్ గ్రూపులు లాభాలను పండించుకున్నాయి. గత రెండు నెలలుగా మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ, మొత్తం మీద 12 శాతం లాభాన్ని సెన్సెక్స్, నిఫ్టీలు అందుకున్నాయి. ముఖేష్ అంబానీ అధీనంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ మార్కెట్ విలువ గతేడాదితో పోలిస్తే రూ. 80 వేల కోట్లు తగ్గి రూ. 2.90 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ కంపెనీ ఈక్విటీ విలువ 20 శాతం దిగజారింది. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని సంస్థల మార్కెట్ క్యాప్ రూ. 50 వేల కోట్లు పడిపోయింది. వేదాంత గ్రూప్, ఐటీసీలు రూ. 20 వేల కోట్లు నష్టపోయాయి. గుజరాతీ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అధీనంలోని సంస్థల మార్కెట్ విలువ రూ. 50 వేల కోట్లు పెరిగింది. టాటా సంస్థలు రూ. 1.10 లక్షల కోట్లు, హెచ్ డీఎఫ్ సీ, సన్ గ్రూప్ సంస్థలు రూ. లక్ష కోట్లకు పైగా లాభాలను ఆర్జించాయి.

  • Loading...

More Telugu News