: 'మతం కన్నా మానవత్వం మిన్న' అని చాటిన సిక్కు యువకునికి బహుమతి
సిక్కులు మత విశ్వాసాలను కఠినంగా పాటిస్తారు. సిక్కులు అత్యంత కఠినంగా పాటించే నియమాల్లో టర్బన్ (తలపాగ) ముఖ్యమైనది. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయరు. విమాన ప్రయాణాల సందర్భంగా టర్బన్ తీయమన్న దేశాలతో న్యాయపోరాటం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపధ్యం నుంచి వచ్చిన ఓ సిక్కు యువకుడి మానవత్వం ముందు మత విశ్వాసం వీగిపోయింది. న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో ఓ కారు యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఓ పిల్లాడు రక్తమోడుతూ విలవిల్లాడుతూ వుండగా, అటువైపుగా వెళ్తున్న సిక్కు యువకుడైన హర్మాన్ సింగ్ కంటపడ్డాడు. హర్మాన్ సింగ్ మతం గురించి ఆలోచించకుండా తన తలకు ఉన్న టర్బన్ తీసి, బాలుడికి రక్తం రాకుండా అడ్డుపెట్టి, మిగిలిని దానిని అతని తలకు దిండుగా వాడాడు. అంబులెన్స్ ను పిలిచి ఆసుపత్రికి తరలించాడు. దీంతో అక్కడి మీడియా అతని ఇంటర్వ్యూ తీసుకుని, జరిగిన విషయం ప్రసారం చేసింది. వీడియోలో హర్మాన్ సింగ్ ఇంట్లో ఫర్నిచర్ లేని విషయం గుర్తించిన ఓ ఫర్నిచర్ షాపు యజమాని, వెంటనే అతనికి ఫర్నిచర్ బహుమతిగా అందజేశాడు. ప్లాస్టిక్ కుర్చీలపై కూర్చుని మేనేజ్ మెంట్ చదువుతున్న హర్మాన్ సింగ్ ఖరీదైన కుషన్ కుర్చీలను చూసి మురిసిపోయాడు. తానింతవరకు అందుకున్న ఖరీదైన బహుమతి ఇదేనని ఆనందబాష్పాలు రాల్చాడు.