: బీరు సీసాతో పొడిచి యువకుడిని చంపిన బాలురు
నేర ప్రవృత్తికి వయసుతో సంబంధం లేదన్న వాదనకు బలం చేకూర్చే ఘటన జరిగింది. ఢిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో 23 ఏళ్ల యువకుడి గొంతులో బీరు సీసాను పొడిచి చంపారు ఇద్దరు బాలురు. వీరిలో ఒకరి వయసు తొమ్మిదేళ్లు కాగా, మరొకరి వయసు 10 సంవత్సరాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులిద్దరూ భిక్షాటన చేసుకునే వారు. మృతుడు సంజీవ్ కుమార్ కల్కాజీ దేవాలయం వద్ద పూల దుకాణం నడుపుకుంటున్నాడు. ఇద్దరు బాలురూ కుమార్ వద్దకు వచ్చి డబ్బులు అడుక్కోగా, మద్యం సేవించి వున్న అతను ఒక బాలుడి చెంపపై కొట్టాడు. దీంతో తీవ్ర కోపంతో అతన్ని కిందపడదోసి, గుండెలపై కూర్చొని బీరు సీసాను పగులగొట్టి గొంతులో పొడిచారు. అప్పటికీ వారిని తోసేసి పారిపోయేందుకు పరుగెత్తిన కుమార్ మార్గమధ్యంలో పడిపోయాడు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మరణించాడు. గొంతులో లోతుగా సీసా దిగడం, తీవ్ర రక్తస్రావం అతని మరణానికి కారణమని వైద్యులు తెలిపారు. ఈ బాలురిద్దరూ నిషేధిత డ్రగ్స్ కి బానిసలని, వారికి పలుమార్లు కుమార్ భోజనం పెట్టాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.