: హత్యాచారం కేసులో అసత్య ఆరోపణలు చేశారంటూ ఓ గ్రామంపై మరో గ్రామం దాడి... ఉద్రిక్తత
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బాలికపై లైంగికదాడి, హత్య కేసులో తమ గ్రామంపై అనవసర ఆరోపణలు చేశారంటూ రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బర్హాద్ గ్రామస్తులు ఇజ్రాచితంపల్లిపై దాడికి యత్నించారు. ఈ కేసులో బాలిక కన్నతండ్రే నిందితుడని తేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బర్హాద్ సమీపంలో జరగడంతో ఆ గ్రామస్తులే దారుణానికి కారణమంటూ కొందరు ఇజ్రాచితంపల్లి వాసులు తీవ్ర ఆరోపణలు చేశారు. వందల సంఖ్యలో కర్రలు చేతబట్టుకుని ఈ ఉదయం ఇజ్రాచితంపల్లి గ్రామానికి చేరుకున్న బర్హాద్ వాసులు ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఇరు గ్రామాల ప్రజలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలుకాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.