: "అమితాబ్ జీ!, మా ఇంటికోస్తారా?" అంటున్న చిన్నారి ఫ్యాన్
బాలీవుడ్ లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. బిగ్ బి సినిమాలను చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఆస్వాదిస్తారు. ఇక విషయానికొస్తే, తనకున్న కోట్లాది మంది అభిమానుల్లో ఒక నాలుగున్నరేళ్ల పాపాయి అమితాబ్ ను ఆకట్టుకుంది. పాప వీడియోను చూసిన అమితాబ్ 'ఫ్యాన్ పిక్ ఆఫ్ ద వీక్' అంటూ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ వీడియోలో ఆ పాప అమితాబ్ ను టీ తాగేందుకు రావాలని తన ఇంటికి ఆహ్వానించింది. అమితాబ్ సినిమా 'అల్లాదీన్' చూశానని, అందులో భూతంలా అద్భుతంగా నటించాడని కితాబిచ్చింది. అందుకే అమితాబ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. అమితాబ్ వస్తే ఎగిరి ఆయన చంక ఎక్కేస్తానని చెప్పింది. తనతో పాటు కొంత సేపు పడుకోవాలని కోరుతానని పాప చెప్పింది. 'ఇంతకీ నీ పిలుపుకి అమితాబ్ వస్తారని అనుకుంటున్నావా?' అని పాప తండ్రి ఆ వీడియోలో అడిగితే, 'నువ్వు పిలువు' అని తండ్రికి పురమాయించింది. 'లండన్ వస్తే ఇంటికి రండి' అని అమితాబ్ ను ఆహ్వానించింది.