: కోహ్లీని కంట్రోల్ చేయాలంటే గట్టి కోచ్ రావాలి: బేడీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ వ్యవహారశైలిపై స్పందించారు. భారత జట్టుకు బీసీసీఐ గట్టి కోచ్ ను నియమించాలని, అలాంటి వ్యక్తి అయితేనే కోహ్లీ దూకుడును నియంత్రించగలడని బేడీ అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో కోహ్లీ ఎన్నో వివాదాలతో వార్తల్లోకెక్కడాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "విరాట్ కు సమర్థుడైన కోచ్ అవసరం ఎంతో ఉందని భావిస్తాను. ఆ కోచ్ మంచి మార్గదర్శి అయి ఉండాలి. కోహ్లీ దూకుడు పట్ల బాధ్యత తీసుకోగల వ్యక్తి కోచ్ గా రావాలి. అతడు (కోహ్లీ) ఉద్రేక స్వభావి. తన స్వభావాన్ని మార్చుకోవాలి. క్రికెట్ అంటే కబడ్డీ, ఖో-ఖో కాదు. ఎక్కువకాలం ఆడాలంటే దూకుడు అదుపులో పెట్టుకోవాలి" అని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.