: మోహన్ బాబుకు ప్రధాని మోదీ లేఖ... మనోజ్ దంపతులకు శుభాకాంక్షలు
సినీ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ వివాహానికి ఆహ్వానించినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకాని సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి రానప్పటికీ నూతన వధూవరులు మనోజ్, ప్రణతి రెడ్డిలకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ లేఖ రాశారు. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు. "ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి ఉత్తరం అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నా. కొత్తగా పెళ్లయిన వధూవరులకు ఆశీర్వాదం తెలుపుతూ అందమైన లేఖ రాశారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన గుర్తుంచుకున్నారు" అని చెప్పారు. మరో ట్వీట్ లో "మోదీజీ నుంచి యువకులు, ఔత్సాహిక రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాలి. ప్రధానంగా నాయకునిగా ఎలా ఉండాలి, స్నేహితుడు, సోదరుడిగా ఎలా ఉంటూ వస్తున్నారు? అన్న విషయాలు నేర్చుకోవాలి" అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు.