: పునరాగమనానికి అతడు అర్హుడే: గవాస్కర్
భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా ఎంపికపై స్పందించారు. టెస్టు జట్టులోకి ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను ఎంపిక చేయడాన్ని ఆయన సమర్థించారు. హర్భజన్ పునరాగమనానికి అర్హుడేనని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న భజ్జీ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడని పేర్కొన్నారు. "ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఆటగాళ్లనే జట్టులోకి తీసుకున్నామని సెలక్టర్లు హర్భజన్ ఎంపిక ద్వారా తెలిపారు. ఓ ఆటగాడు జూనియర్ అయినా, సీనియర్ అయినా బాగా ఆడుతుంటే జట్టులోకి వస్తాడు. హర్భజన్ విషయానికొస్తే... 400కి పైగా టెస్టు వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఎవరికీ, ఏదీ నిరూపించుకోవాల్సిన అగత్యం లేదతడికి. రంజీ ట్రోఫీ ప్రదర్శనపై ఆధారపడి జట్టులోకి రావాల్సిన అవసరం అంతకన్నాలేదు. ఫామ్ లో ఉన్న భజ్జీ స్లోగా బంతులు విసురుతూ, బాగా టర్న్ చేస్తున్నాడు. బౌన్స్ కూడా రాబడుతున్నాడు. సెలక్టర్లు ఈ అంశాలను గుర్తించి ఉంటారు" అని పేర్కొన్నారు.