: ఈ ఉద్యోగాలకు భవిష్యత్ లో మనుషులు అక్కర్లేదు!
ఉద్యోగాల్లో మనుషులకు రోబోలు గట్టిపోటీనిస్తున్నాయి. మనుషులు చేసే పలు పనులను రోబోలు సమర్థవంతంగా పూర్తి చేస్తూ సవాలు విసురుతున్నాయి. రోజురోజుకూ వీటి నాణ్యతను పెంచుతూ, రోబోలు మనుషులకంటే బాగా పని చేయగలవని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. దీంతో, పలు విభాగాల్లో రోబోల వినియోగం పెరిగిపోతోంది. మనుషులకు నెల నెలా జీతాలు సమర్పించే బదులు, ఒకేసారి పెద్ద మొత్తం వెచ్చిస్తే జీవితాంతం రోబోలు సొంతమైపోతాయని, ఉచితంగా పనులు చేయించుకోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోబోలను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. టోల్ బూత్ ఆపరేటర్, క్యాషియర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, పరిశ్రమల్లో కార్మికులు, పత్రికల ఉప సంపాదకులు (ఇప్పటికే రోబోలు వేల సంఖ్యలో కథనాలను అసోసియేటెడ్ ప్రెస్ కు ఎడిటింగ్ చేసి పెడుతున్నాయట), కస్టమర్ కేర్ కేంద్రాల్లో మాట్లాడేందుకు, టెలిఫోన్ బిల్లింగ్ కేంద్రాల్లో పనిచేసేందుకు రోబోలు సిద్ధంగా ఉన్నాయట. అంతేకాదు, మనుషుల కంటే సమర్థవంతంగా పనులు చక్కబెడుతున్నాయట. దీంతో, భవిష్యత్ లో రోబోలు మనుషుల విధుల్లో పోటీగా నిలవనున్నాయి.