: సాగుతో సంపద పెరగదు... నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగడియా వివాదాస్పద వ్యాఖ్య


దేశానికి వెన్నెముక వ్యవసాయం. ఇప్పటికీ పల్లె సీమలే కేంద్రంగా జీవనం సాగిస్తున్న 70 శాతం మంది దేశ ప్రజల్లో మెజారిటీ ప్రజల జీవనాధారం వ్యవసాయమే. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధికి సాగు రంగమే కీలకమని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే. అయితే దేశాభివృద్ధికి సరికొత్త రీతిలో ప్రణాళికలు రచించేందుకంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చిన నీతి ఆయోగ్ ఛీప్ మాత్రం ఈ భావనతో విభేదిస్తున్నారు. దేశ ఆర్థిక రంగంలోనే కాక ప్రపంచ ఆర్థికవేత్తల్లో పేరెన్నికగన్న అరవింద్ పనగడియాను నరేంద్ర మోదీ ఏరికోరి నీతి ఆయోగ్ కు వైస్ చైర్మన్ గా నియమించారు. నీతి ఆయోగ్ ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలే ఎక్కలేదు, అరవింద్ పనగడియా మాత్రం నిన్న ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసి దేశాన్నే నివ్వెరపరిచారు. వ్యవసాయంతో సంపద పెరగదని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న నీతి ఆయోగ్ వెబ్ సైట్ ప్రారంభించిన అనంతరం ఆయన నీతి ఆయోగ్ బ్లాగులోనే ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. సాగుతో సంపద పెరగదన్న ఆయన, పారిశ్రామిక అభివృద్ధితోనే సంపద వృద్ధి సాధ్యమని తేల్చేశారు. ఇందుకు తైవాన్, కొరియాలను ఆయన ఉదహరించారు. సాగుతో సంపద పెరగదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News