: మన్మోహన్, మోదీ... ఇద్దరి పాలనలో ఎన్నో పోలికలు!
ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం అయింది. ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై మునుపటి ప్రధాని మన్మోహన్ పాలనతో పోలిస్తే ఎన్నో పోలికలు కనిపించాయి. 'ఇండియా స్పెండ్ డాట్ ఓఆర్జీ' విశ్లేషణల ప్రకారం, మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2008-09 గణాంకాలతో పోలిస్తే మోదీ సంవత్సరం పరిపాలన ఏమంత గొప్పగా లేదు సరికదా, కొన్ని విషయాల్లో మన్మోహన్ ప్రభుత్వం మంచి గణాంకాలు నమోదు చేసింది. 2008-09లో జరిగినట్టే గడచిన సంవత్సర కాలంలో ఎగుమతి, దిగుమతులు గణనీయంగా తగ్గాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి, వాడకం, పెట్రోలు వినియోగం తదితరాలూ పెరిగాయి. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల శాతమూ పెరిగింది. అప్పట్లో పారిశ్రామికోత్పత్తి 10.4 శాతం పెరుగగా, 2014-15లో ఐఐపీ 4.2 శాతం వృద్ధికే పరిమితమైంది. అప్పట్లో జీడీపీ 8.9 శాతం వృద్ధిని నమోదు చేయగా, గడచిన ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.4 శాతంగా ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. దేశంలో 60 కోట్ల మంది జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగం మన్మోహన్ తొలి సంవత్సరం పాలనలో 0.8 శాతం పెరుగగా, మోదీ పగ్గాలు చేపట్టిన తరువాత 1.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. బొగ్గు రంగం అప్పట్లో 8.1 శాతం వృద్ధిని, గత సంవత్సరం 8.2 శాతం వృద్ధిని సాధించింది. పెట్రోలియం ఉత్పత్తుల వాడకం 2008-09లో 3.2 శాతం, 2014-15లో 3.1 శాతం పెరిగింది. ఇలా గణాంకాలన్నీ ఇద్దరి పాలనా సమానమేనని చూపుతున్నాయి.