: దక్షిణ కొరియా చేరుకున్న ప్రధాని మోదీ... సియోల్ విమానాశ్రయంలో ఘన స్వాగతం
చైనా, మంగోలియా దేశాల పర్యటనలను విజయవంతంగా ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ... ఈ ఉదయం దక్షిణ కొరియా చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దక్షిణ కొరియా వచ్చిన మోదీకి... ఆ దేశ రాజధాని సియోల్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హితో మోదీ కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఆర్థిక, వాణిజ్య, రక్షణ సహకారంపై చర్చలు జరిపే అవకాశం ఉంది. తన పర్యటనలో భాగంగా 'హ్యుందాయ్ హెవీ ఇండస్ట్రీస్ షిప్ యార్డ్'ను మోదీ సందర్శించనున్నారు. రెండు దేశాల మధ్య షిప్ బిల్డింగ్ రంగంలో సహకారం పెంపొందించుకునేందుకు ఈ సందర్శనను ఆయన చేపడుతున్నారు. మోదీ సియోల్ చేరుకున్న సందర్భంగా, తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన భారతీయులతో ఆయన కరచాలనం చేశారు.