: నా కుమార్తె లంచమివ్వబోతే అధికారులు తీసుకోలేదు: ఢిల్లీ మారిందన్న కేజ్రీవాల్
అవినీతిని రూపుమాపే విషయంలో తమ ప్రభుత్వం 70 నుంచి 80 శాతం విజయం సాధించినట్టేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. తన కుమార్తె లంచమివ్వబోతే అధికారులు స్వీకరించలేదని, ఢిల్లీ మారిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. లంచాలు స్వీకరించేందుకు అధికార్లు నిరాకరిస్తున్నారని తెలిపారు. లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు వెళ్లిన తన కుమార్తె ఓ సర్టిఫికెట్ ను తీసుకువెళ్లలేదని, అక్కడి అధికారి లైసెన్స్ ఇచ్చేందుకు నిరాకరించగా, తానెవరో చెప్పకుండా లంచమిస్తానని ఆఫర్ చేసిందని కేజ్రీవాల్ వివరించారు. ఆ వెంటనే ఆమె ఫోన్ వైపు తేరిపార చూసి, ఆమె రికార్డు చేయడం లేదని ధ్రువీకరించుకున్నప్పటికీ, లంచం తీసుకోనని, లైసెన్స్ ఇవ్వలేనని ఆయన తేల్చిచెప్పేశాడట. కాసేపటి తరువాత తన పూర్తి సర్టిఫికెట్లు ఆ అధికారికి ఇచ్చిందని, ఆమె వివరాలు చూసిన అధికారితో పాటు ఆర్ టీఏ కార్యాలయం మొత్తం తరలివచ్చి లైసెన్స్ ఇచ్చి పంపారని కేజ్రీవాల్ తెలిపారు. నగరంలో అవినీతి తగ్గిందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఇక ఆటో డ్రైవర్లు ప్రయాణికులను వేధించడం మానివేయాలని సూచించారు. కాగా, ఏప్రిల్ 5న ఆప్ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక హెల్ప్ లైన్ 1031ను ప్రారంభించగా, ఇప్పటివరకూ 1.25 లక్షల కాల్స్ వచ్చాయి.