: సిక్కు మానవత్వం... చిన్నారి రక్తస్రావాన్ని ఆపేందుకు తలపాగా తీసిన యువకుడు
ఏ సిక్కూ చేయడానికి సాహసించని పని చేసి తన మానవత్వాన్ని చాటుకుని అందరిచేతా 'భేష్' అని పొగిడించుకున్నాడో యువకుడు. ఓ బాలుడి రక్తస్రావాన్ని అరికట్టేందుకు తన తలపాగాను తీశాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో జరిగింది. 23 ఏళ్ల హర్మన్ సింగ్ ఆక్లాండ్ లోని తన ఇంట్లో ఉండగా, ఓ ఐదేళ్ల అబ్బాయి, తన చెల్లెలితో కలసి రోడ్డుపై వెళుతూ కారు ప్రమాదానికి గురికావడాన్ని గమనించాడు. బాలుడి తలకు గాయమై రక్తం కారుతుండగా, మరో ఆలోచన లేకుండా తన టర్బన్ (తలపాగా) తీసి కట్టు కట్టాడు. ఆ సమయంలో తాను సంప్రదాయాల గురించి ఆలోచించలేదని, జరిగిన ప్రమాదాన్ని మాత్రమే చూశానని, ఆ సమయంలో సహాయపడడం తన కర్తవ్యమని అన్నాడు హర్మన్ సింగ్. ఈ మొత్తం ఘటనపై 'న్యూజిలాండ్ హెరాల్డ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మత ధర్మాల ప్రకారం టర్బన్ తీయడం చాలా పెద్ద తప్పని, వాటిని మరచి మానవత్వం చూపిన హర్మన్ అభినందనీయుడని కొనియాడింది. హర్మన్ టర్బన్ ను తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న మరో యువకుడు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఇప్పుడా ఫోటో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.