: నరేంద్ర మోదీతో అలీబాబా చైర్మన్ 'జాక్ మా' చర్చలు
చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ 'జాక్ మా' భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక చర్చలు జరిపారు. తన చైనా పర్యటనలో భాగంగా షాంఘైలో జరిగిన కార్యక్రమంలో 22 చైనా కంపెనీల సీఈఓలతో మోదీ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 'జాక్ మా'తో మోదీ విడిగా సమావేశం కావడం విశేషం. వీరిద్దరి మధ్యా జరిగిన చర్చల సారాంశం బయటకు వెల్లడి కానప్పటికీ, భారత మార్కెట్లోకి అపారమైన అవకాశాలపై కన్నేసిన అలీబాబా మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచనలు చేస్తూ, అందుకు తగ్గ సహకారం అందించాలని కోరినట్టు సమాచారం. కాగా, సీఈఓల సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ, ప్రస్తుత శతాబ్దం ఆసియాదేనని బలంగా నమ్ముతున్నట్టు వివరించారు. యువతకు ఉపాధి కోసం మాన్యుఫాక్చరింగ్ సెక్టారుకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని నిర్ణయించామని అన్నారు. సమీప భవిష్యత్తులో ఇండియాలోని 50 నగరాల్లో మెట్రో రైళ్లకు ప్రణాళికలు రూపొందించామని మోదీ తెలిపారు.