: మోదీని నిలదీశాం...నీళ్లు నమిలారు: రాహుల్


యూపీఏ అధికారంలో ఉండగా 2013లో భూసేకరణ చట్టం ప్రవేశపెట్టినప్పుడు, దానిని వెంటనే ఆమోదించిన బీజేపీ, ఇప్పుడు మళ్లీ ఆ చట్టాన్ని సవరించడానికి కారణమేంటని పార్లమెంటులో నిలదీశామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ లో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో భూసేకరణ చట్టం గురించి అడిగినప్పుడు కేంద్రం నీళ్లు నమిలిందని అన్నారు. తరువాత ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని తెలిపిందని ఆయన చెప్పారు. అయితే ఎన్ని ప్రాజెక్టులు భూముల్లేక ఆగాయో చెప్పాలని ప్రశ్నిస్తే, కేవలం 8 శాతం ప్రాజెక్టులు మాత్రమే భూమి లేక ఆగాయని కేంద్రం సమాధానమిచ్చిందని ఆయన అన్నారు. అంటే దేశంలోని పారిశ్రామిక వేత్తల్లో కేవలం 8 శాతం మంది కోసం కేంద్రం ఎంత కష్టపడి పనిచేస్తోందో రైతులు తెలుసుకోవాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతుల ప్రయోజనాలు కాలరాస్తూ, అతి కొద్ది మంది పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలు కాపాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పారిశ్రామిక వేత్తలు కూడా భూమి లాక్కోవాలని చూడడానికి కారణం, రైతుల భూముల్లో బంగారం ఉండడమేనని, ప్రతి రైతూ దేశానికి అన్నం పెడుతున్నాడని, అలా కాకుండా రైతులంతా పారిశ్రామిక వేత్తల నుంచి అన్నం కొనుక్కోవాలని ఏన్డీయే సర్కారు కోరుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిండా అప్పుల్లో మునిగిపోయిన పేదరైతు తన భూమిని అమ్మి కష్టాలు తీర్చుకుందామని భావిస్తాడని, రైతులకు ఆ అవకాశం కూడా లేకుండా చేయడమే ఎన్డీయే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News