: దేవేందర్ గౌడ్ ప్రార్థనలు ఫలించాయి... సురక్షితంగా తిరిగొచ్చిన వీరేందర్!


టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రానికి హోం శాఖ మంత్రిగా పనిచేసిన తూళ్ల దేవేందర్ గౌడ్ ప్రార్థనలు ఫలించాయి. నేపాల్ భూకంప బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఆయన కొడుకు వీరేందర్ గౌడ్ క్షేమంగా తిరిగొచ్చారు. నేపాల్ బాధితులకు సహాయం అందించేందుకు దేవేందర్ ఫౌండేషన్ తరఫున 16 మంది సభ్యుల బృందంతో నేపాల్ వెళ్లిన వీరేందర్ అక్కడి సింధుపాల్ చౌక్ జిల్లా షౌలే బజార్ గ్రామం కేంద్రంగా 800 మందికి ఆహారాన్ని అందించారు. అయితే మూడు రోజుల క్రితం సంభవించిన మరో భూకంపం ధాటికి షౌలే బజార్ గ్రామంపై కొండ చరియలు విరిగిపడ్డాయి. మీదకు దూసుకువచ్చిన బండరాళ్ల నుంచి తప్పించుకున్న వీరేందర్ గౌడ్, అతడి బృందం సభ్యులు సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న దేవేందర్ గౌడ్ నిన్న హుటాహుటీన ఢిల్లీ చేరుకుని తన కుమారుడిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అశోకగజపతి రాజులను వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం వీరేందర్ బృందాన్ని నిన్న సాయంత్రానికి సురక్షితంగా ఢిల్లీకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా వీరేందర్ మీడియాతో మాట్లాడుతూ బాధితులకు నేరుగా సహాయం అందించడం సంతృప్తినిచ్చిందన్నారు. అయితే తాజా భూకంపం నేపథ్యంలో అక్కడ ఉండటం క్షేమం కాదన్న బాధితులు, తమ కుటుంబ సభ్యుల సలహాతో తిరిగి వచ్చేశామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News