: రాహుల్ గాంధీ రూట్ మార్పునకు టీ కాంగ్ నేతల ఆర్భాటమే కారణమట!


రైతు భరోసా యాత్ర కోసం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న ఆదిలాబాదు జిల్లా నిర్మల్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి మేడ్చల్ మీదుగా నిర్మల్ చేరాల్సిన రాహుల్ గాంధీ, చివరి క్షణంలో తన రూట్ ను మార్చుకున్నారు. నిర్మల్ కు సమీపంలోని మహారాష్ట్రకు చెందిన నాందేడ్ కు విమానంలో చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నిర్మల్ చేరుకున్నారు. ఈ విషయం తెలియని టీ కాంగ్రెస్ నేతలు శంషాబాదు నుంచి నిర్మల్ దాకా పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం దాదాపు రూ. 2 కోట్ల మేర ఖర్చు చేశారు. నాందేడ్ మీదుగా రాహుల్ నిర్మల్ చేరుకోవడంతో ఆగ్రహానికి గురైన సదరు నేతలు, రాహుల్ సన్నిహితుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురైనందునే రాహుల్ నాందేడ్ మీదుగా రావాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు టీ కాంగ్ నేతలకు సర్దిచెప్పారు. అయితే టీ కాంగ్ నేతలు తనకోసం ఆర్భాటంగా చేసిన స్వాగత ఏర్పాట్లపై సమాచారం అందుకున్న తర్వాతే రాహుల్ తన రూట్ ను మార్చుకున్నారని ఆ తర్వాత తెలిసింది. రైతు భరోసా యాత్రకు వస్తుంటే ఇంతపెద్ద ఎత్తున ఆర్భాటంగా స్వాగత ఏర్పాట్లేమిటని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొద్దిగా అలిగిన రాహుల్, నాందేడ్ మీదుగా నిర్మల్ చేరుకున్నారని తెలియడంతో టీ కాంగ్ నేతలు కంగుతిన్నారట.

  • Loading...

More Telugu News