: ఈసారి అనువాదకురాలు అవతారమెత్తిన ప్రీతి జింటా
బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా అటు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యజమానిగా కూడా రాణించింది. నిన్నటి వరకు ఆ హోదాలో మ్యాచ్ లకు హాజరైన ప్రీతి, ఈసారి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు వీరాభిమానిగా మ్యాచ్ లకు హాజరైంది. ఈ సందర్భంగా ఈ సొట్టబుగ్గల సుందరి అనువాదకురాలు (ఇంటర్ ప్రెటార్) అవతారమెత్తింది. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొహాలీలో జరిగిన మ్యాచ్ లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికైన అక్షర్ పటేల్ హిందీలో ప్రావీణ్యుడు. ఇతర భాషలంటేనే కాస్త ఇబ్బంది పడతాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ కు ప్రీతి జింటా ఇంటర్ ప్రెటార్ గా మారింది. అక్షర్ పటేల్ హిందీలో చెప్పిన విషయాన్ని ఇంగ్లిష్ లోకి తర్జుమా చేసింది. దీనిపట్ల వెటరన్ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాంఛైజీ యజమాని భేషజాల్లేకుండా ఓ క్రికెటర్ కు ఇంటర్ ప్రెటార్ గా వ్యవహరించడం హర్షణీయమని పేర్కొన్నారు.