: సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు మరిన్ని కష్టాలు!


సోనియా గాంధీ అల్లుడిగా ఒకప్పుడు రాచమర్యాదలు అనుభవించిన రాబర్ట్ వాద్రా మరింత కష్టాల్లో పడనున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. యూపీఏ పాలన కొనసాగిన సమయంలో ఆయన జరిపిన భూ లావాదేవీలపై ఉన్నతస్థాయి విచారణ సంఘాన్ని నియమించి దర్యాఫ్తు చేయించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టార్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వతంత్ర కుమార్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని బీజేపీ హర్యానా ఇన్ చార్జ్, జాతీయ కార్యదర్శి అనిల్ జైన్ స్పష్టం చేశారు. భూ వివాదాలపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఈ సంవత్సరం కాగ్ విడుదల చేసిన నివేదికలో రాబర్ట్ వాద్రా సంస్థ స్కైలైట్ హోటల్ లావాదేవీల విషయంలో భూపేందర్ సింగ్ హూడా సర్కారు నిబంధనలను అతిక్రమించి మరీ అనుమతులివ్వడం ద్వారా ఆయనకు లాభం చేకూర్చిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీల్లో నికర లాభంపై 15 శాతం ఖజానాకు చెందాల్సి వుండగా, ఆ మేరకు చెల్లింపులు జరగలేదని వివరించింది.

  • Loading...

More Telugu News