: చాలా బాధ కలిగింది... పాప కోసం ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధం: ఎన్టీఆర్
బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, ప్రాణాల కోసం పోరాడుతున్న పదేళ్ల చిన్నారి శ్రీనిధిని నటుడు జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించాడు. కూకట్ పల్లిలో ఉన్న రాందేవ్ ఆసుపత్రికి వెళ్లిన జూనియర్... నేరుగా శ్రీనిధి వద్దకు వెళ్లాడు. చిన్నారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆప్యాయంగా మాట్లాడాడు. తనతో పాటు తీసుకువచ్చిన పెద్ద టెడ్డీ బేర్ బొమ్మ, చాక్లెట్లను ఇచ్చాడు. తన యాక్షన్ ఇష్టమా? డ్యాన్సులు ఇష్టమా? అని చిన్నారిని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా, మీ డ్యాన్సులంటే చాలా ఇష్టమని శ్రీనిధి చెప్పింది. ఈ సందర్భంగా, సినిమా విషయాలు, స్కూలు విషయాల గురించి మాట్లాడాడు. త్వరలోనే కోలుకుని స్కూలుకు వెళతావని చిన్నారికి చెప్పాడు. టెడ్డీ బేర్ ను ఎప్పుడూ దగ్గరే ఉంచుకోమని శ్రీనిధికి ఎన్టీఆర్ చెప్పాడు. అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీనిధిని చూసిన తర్వాత చాలా ఆవేదన కలిగిందని చెప్పాడు. ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోయానని అన్నాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని... ఆ పాప మళ్లీ నవ్వుతూ మన మధ్య సరదాగా తిరగాలని కోరుకుంటున్నానని జూనియర్ అన్నాడు. తనను చూసిన శ్రీనిధి ముఖంలో ఆనందాన్ని చూశానని చెప్పిన ఎన్టీఆర్... పాప ఆరోగ్యం కోసం అందరం ప్రార్థిద్దామని కోరాడు. తన ఆశీస్సులతో పాటు అందరి ఆశీస్సులు శ్రీనిధికి ఉంటాయని చెప్పాడు. పాప కోసం ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు.