: ఆ ఎస్పీకి శాసనసభ్యులంటే గౌరవం లేదట... చంద్రబాబుకు విశాఖ ఎమ్మెల్యేల ఫిర్యాదు!
ఐపీఎస్ అధికారి ప్రవీణ్ రావుకు శాసనసభ్యులంటే ఏమాత్రం గౌరవం లేదట. ఈ విషయాన్ని ఆయన చేతిలో అవమానానికి గురైన ఎమ్మెల్యేలే నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే... విశాఖ రూరల్ ఎస్పీగా పనిచేస్తున్న ప్రవీణ్ రావు, ఎమ్మెల్యేల మాటను ఏమాత్రం లెక్కచేయడం లేదట. జిల్లాకు చెందిన ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సిఫారసులనైనా ఆయన బుట్టదాఖలు చేస్తున్నారు. అంతేకాక ఎమ్మెల్యేల మనుషులుగా తన వద్దకు వస్తున్న వారిపై అంతెత్తున ఎగిరిపడుతున్నారు. వారిపై తిట్ల దండకం కూడా అందుకుంటున్నారు. ఈ మేరకు నిన్న జిల్లాకు చెందిన పది మంది శాసనసభ్యులు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం.