: తీర ప్రాంత రాష్ట్రాల్లో ఇదో పెద్ద సమస్య... కేంద్రంపై ధ్వజమెత్తిన రాహుల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని తీర ప్రాంత మత్స్యకారులకు బాసటగా నిలిచారు. చేపలవేటపై కేంద్రం విధించిన వార్షిక నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్ణయం విదేశీ ట్రాలర్లకు మేలు చేస్తుందని అన్నారు. వేసవి కాలం చేపల ప్రత్యుత్పత్తి సమయం కావడంతో ప్రతి ఏడాది కేంద్రం కొన్ని రోజుల పాటు సముద్ర జలాల్లో చేపల వేటను నిషేధిస్తుండడం తెలిసిందే. దీనిపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. "తీర ప్రాంత రాష్ట్రాల్లో చేపల వేటపై నిషేధం చాలా పెద్ద సమస్య. మామూలుగానే మన సర్కారు రైతులు, మత్స్యకారులు, కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు విదేశీ ట్రాలర్లను భారత సముద్ర జలాల్లోకి అనుమతిస్తున్నారు. ఈ నిర్ణయం అన్ని తీర ప్రాంత రాష్ట్రాల మత్స్యకారులపై పెను ప్రభావం చూపుతోంది. ఈ సూటు-బూటు సర్కారు హాని చేస్తోంది రైతులకే కాదు, దేశంలో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికీ హాని చేస్తోంది. బతుకుదెరువు కోసం కష్టపడుతున్న మత్స్యకారులు, కార్మికులు, రైతులు... ఇలా అందరినీ నష్టపరుస్తోంది. చేపలవేటపై నిషేధం ఎత్తివేసి, మత్స్యకారులను వారి పని వారిని చేసుకోనివ్వాలి" అని అన్నారు.