: మంత్రులుగా ఈరోజు ఉంటాం, రేపు ఉండకపోవచ్చు... ఆర్టీసీ శాశ్వతం: మంత్రి అచ్చెన్నాయుడు


ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మంత్రులుగా తాము ఈరోజు ఉంటాం, రేపు ఉండకపోవచ్చని, కానీ, ఆర్టీసీ శాశ్వతమని అన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కార్మికుల డిమాండ్లను లోతుగా పరిశీలించి, సమస్యల పరిష్కారం వెతకాల్సి ఉందని స్పష్టం చేశారు. 43 శాతం ఫిట్ మెంట్ తో సమస్య పరిష్కారం కాదని, ఇంకా ఎన్నో అంశాలను పరిశీలించాలని తెలిపారు. అందుకే, కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. మరో మూడు వారాల్లోగా తాము సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా నష్టపోవడాన్ని ప్రభుత్వం అంగీకరించబోదని, ఏ మాత్రం ఆర్థిక వెసులుబాటు ఉన్నా న్యాయం చేసేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు వివరించారు. మంత్రివర్గ ఉపసంఘం వేసిన తర్వాత కూడా కార్మికులు సమ్మెకు దిగడం బాధాకరమని, ఎంసెట్ పరీక్ష, వివాహాలు ఉన్న తరుణంలో సమ్మె సరికాదని చెప్పామని, వినలేదని అన్నారు. విపరీతమైన రద్దీ సమయంలో 62 శాతం బస్సులు నడిపామని చెప్పారు. కార్మిక సంఘాలతో రేపు మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News