: కేంద్రంతో గొడవ పెట్టుకోం... స్నేహంగానే ఉంటాం: టీడీపీ నేత గాలి
ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి పలు రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని... చివరకు రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విభజించిన కాంగ్రెస్ కూడా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావాలంటూ కాంగ్రెస్ ఉచిత సలహా ఇస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదాపై అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ ఇచ్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని, అలా చేయకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము బీజేపీతో ఘర్షణ వైఖరితో వ్యవహరించమని గాలి స్పష్టం చేశారు. కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్న బీజేపీతో ఘర్షణ వైఖరి మంచిది కాదని... కేంద్రానికి సహకరిస్తూ, వారి నుంచి పలు రాయితీలు పొందాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్డీయే నుంచి వైదొలగితే మనకే నష్టమని తెలిపారు.