: ‘కింగ్స్’కు మరో ఓటమి... పాయింట్ల పట్టికలో అగ్రాసనానికి కోల్ కతా
ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో కాసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో విజయదుందుభి మోగించిన గౌతీ సేన, ఏడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని 15 పాయింట్లతో చైన్నైని కిందకు తోసేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (43) చెలరేగినా, కోల్ కతా బౌలర్ సునీల్ నరైన్ నాలుగు వికెట్లతో పంజాబ్ వెన్నువిరిచాడు. ఆ తర్వాత 184 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా 19.5 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి విజయం సాధించింది. స్వల్ప స్కోరుకే నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్ కతాను ఆ జట్టు బ్యాట్స్ మన్ ఆండ్రూ రస్సెల్ (51) ఆదుకున్నాడు.