: ఆర్టీసీ సమ్మెకు హరీశ్ రావు మద్దతిస్తున్నారట...టీఎంయూ నేత ప్రకటన
తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆర్టీసీ ఎండీ సాంబశివరావే పరోక్షంగా చెప్పేశారు. 27 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నా, కేసీఆర్ ఆ మాత్రం ప్రకటన కూడా చేయలేదని ఆయన నిన్నటి కార్మిక సంఘం నేతలతో చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు కూడా కేసీఆర్ బాటలోనే నడవాల్సి ఉంది. అయితే కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా, ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలుకుతున్నారట. ఈ మేరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నేత అశ్వథ్థామరెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు హరీశ్ రావు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఆయన తమ సమ్మెకు మద్దతు పలుకుతున్నారని అశ్వథ్థామరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే, అశ్వథ్థామరెడ్డి తరహాలోనే టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలకు హరీశ్ రావు మద్దతు పలుకుతున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.