: ముందుంది మొసళ్ల పండగ... కామెరాన్ విజయంపై బ్రిటన్ పత్రికలు
మరోసారి ప్రధానిగా గెలిచానని సంబరపడుతున్న డేవిడ్ కామెరాన్ కు అసలు కష్టాలు ముందున్నాయని, వాటి నుంచి అంత సులువుగా తప్పించుకోలేరని బ్రిటన్ పత్రికలు వ్యాఖ్యానించాయి. స్కాట్లాండ్ ను యూకేలో కలిపి ఉంచడం, యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ ను భాగంగా కొనసాగించడం ఆయన ముందున్న పెను సవాళ్లని మీడియా అభిప్రాయపడింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ, బ్రిటన్ ప్రజలు ఆయనను వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు బ్రిటన్ లో నువ్వా? నేనా? అన్న రీతిలో తలపడగా, స్కాట్లాండులో మాత్రం అక్కడి స్కాటిష్ నేషనల్ పార్టీ 59 సీట్లలో 56 గెలుచుకుని కామెరాన్ పక్కలో బల్లెమైందని పత్రికలు వ్యాఖ్యానించాయి.