: పాక్ లో కూలిన హెలికాప్టర్... నార్వే, ఫిలిప్పీన్స్ రాయబారుల మృతి
పాకిస్థాన్ లోని గిలిగిత్ ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో నార్వే, ఫిలిప్పీన్స్ దేశాల రాయబారులు మరణించారు. పాక్ వాయుసేన నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి బయులుదేరిన వీరి హెలికాప్టర్ మార్గమధ్యంలోని నల్తార్ వ్యాలీలో అత్యవసర ల్యాండింగుకు ప్రయత్నించినప్పుడు ఈ దుర్ఘటన జరిగినట్టు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఇదే ప్రమాదంలో చాపర్ పైలెట్ సహా మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి వుండగా, హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలుసుకుని ఆయన వెనక్కు తిరిగినట్టు తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.