: నీతూ అగర్వాల్ మొబైల్ లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల నెంబర్లు!
ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటించి, సదరు చిత్ర నిర్మాతనే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి నీతూ అగర్వాల్, ఎర్రచందనం అక్రమ రవాణాలో భర్తకు బాగానే సహకరించిందట. వైసీపీ నేత, కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలీని పెళ్లి చేసుకున్నట్లు నీతూనే స్వయంగా అంగీకరించింది. ఈ కేసులో ఆమె ప్రమేయంపై పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. భర్త రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అతడి చీకటి దందాను గుట్టుచప్పుడు కాకుండా నీతూనే నడిపిందట. ఇందులో భాగంగా ఆమె పెద్ద ఎత్తున డబ్బును తీసుకోవడమే కాక మస్తాన్ వలీ చెప్పినట్లు ఆయా వ్యక్తులకు ఆ డబ్బును చేరవేసిందట. ఇక కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ఆమె వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో నిత్యం టచ్ లో ఉండేదట. ఆ ఎమ్మెల్యేలలో ఇద్దరు కర్నూలు జిల్లాకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వారట. వారి ఫోన్ నెంబర్లు నీతూ మొబైల్ ఫోన్ లో ఉన్నాయి. అయితే ఆ నెంబర్లు ఎవరివన్న వివరాలను పోలీసులు బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. అరెస్ట్ కాకముందు సదరు నేతలతో నీతూ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నట్లు సమాచారం.