: అభివృద్ధి ఎక్కడ జరుగుతోంది?: మోదీని నిలదీసిన బీజేపీ ఎంపీ
ఆయన భారతీయ జనతా పార్టీ తరపున ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు భరత్ సింగ్. క్షేత్ర స్థాయిలో అభివృద్ధి ఎక్కడ జరుగుతోందని స్వయంగా ప్రధాని మోదీనే నిలదీశాడు. ఈ ఘటన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జరగడంతో, అక్కడున్న మిగతా ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు కాస్తంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం గడుస్తున్నా, అభివృద్ధి జరుగుతున్న జాడలు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ కార్యాలయ బేరర్లూ ఎంపీలకు అందుబాటులో ఉండడం లేదని కూడా భరత్ సింగ్ ఆరోపించారని, తాము లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని నిరసన తెలిపారని ఇదే సమావేశాల్లో పాల్గొన్న మరో ప్రజాప్రతినిధి తెలిపారు. ఆయన మాట్లాడుతుంటే పలువురు చప్పట్లతో ఉత్సాహపరిచారని, దీంతో మోదీ అసహనంగా ఫీలయ్యారని వివరించారు. ఆ తరువాత కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ, ఆయన చేసిన విమర్శలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించినవని, కేంద్రం ఇస్తున్న నిధులు యూపీ సర్కారు సరిగ్గా వినియోగించడం లేదన్నది ఆయన మాటల అంతరార్థమని అనడం గమనార్హం.