: బీటెక్ విద్యార్థులు కుదురుగా ఉండరట... ఉద్యోగాలు లేవు పొమ్మన్న ఇస్రో!
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లో ఉద్యోగాలంటే, సాధారణంగా విద్యార్థుల్లో యమా క్రేజ్. ఇస్రో నుంచి అటు ప్రకటన వెలువడగానే అర్హతలున్న అన్ని కేటగిరీల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష రాశారు. ఇంటర్వ్యూలకు కొంతమంది ఎంపికయ్యారు. వీరిలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మేనేజ్ మెంట్ విభాగాల విద్యార్థులతో పాటు బీఈ, బీటెక్ చదివిన విద్యార్థులూ ఉన్నారు. అయితే బీఈ, బీటెక్ విద్యార్థులకు ఉద్యోగాలు లేవు పొమ్మంటూ ఇస్రో ముఖం మీదే చెప్పేసింది. అదేంటీ పరీక్షకు అనుమతించారు, ఇంటర్వ్యూకు పిలిచారు, ఇప్పుడు ఉద్యోగాలు లేవు పొమ్మంటే ఎలాగంటూ నిలదీయడంతో, ఇస్రో చెప్పిన సమాధానంతో సదరు భావి ఇంజినీర్లు షాక్ కు గురయ్యారట. అసలు ఇస్రో చెప్పిన కారణమేంటంటే... ఇంజినీరింగ్ విద్యార్థులు కుదురుగా ఒక్కచోట ఉద్యోగం చేయరట. వేరే ఉద్యోగం దొరకని కారణంగానే బీటెక్ విద్యార్థులు తమ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారని ఇస్రో అధికారులు వితండవాదన చేశారు. దీంతో ఇంటర్వ్యూలకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు ఊసురోమంటూ వెనుదిరిగారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఇస్రోలో వెలుగు చూసిన ఈ వింత తరహా ఘటనలో మొన్న ఎనిమిది మంది, నిన్న పది మంది విద్యార్థులు ఇంటర్వ్యూ లెటర్లున్నా, నిరాశతో వెనుదిరిగారు.