: తప్పు మీద తప్పు... అందుకే సల్మాన్ కు ఐదేళ్ల జైలు!


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షపై పలు ఆసక్తికర కథనాలు వెలుగు చూస్తున్నాయి. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమైన కేసులో ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం సల్మాన్ కు రెండేళ్ల కంటే మించి శిక్ష విధించే అవకాశం లేదు. అయితే, 13 ఏళ్ల క్రితం జరిగిన నాటి ప్రమాదంలో సల్మాన్ ఖాన్ తప్పు మీద తప్పు చేశాడు. అందుకే అతడికి ఐదేళ్ల శిక్ష పడింది. మద్యం మత్తులో ఉన్న సల్మాన్ తన కారును స్వయంగా నడపడమే కాక ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి ఎక్కించాడు. అంతేకాక తన కారు చక్రాల కిందపడి నలిగిపోయిన క్షతగాత్రులను అక్కడే గాలికి వదిలేసి పరారయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వైద్య చికిత్సలు అందే ఏర్పాట్లు చేసి ఉంటే, సల్మాన్ కు ఇంత పెద్ద శిక్ష పడేది కాదట. ఒకదాని వెంట మరొకటి తప్పులు చేస్తూ వెళ్లిన సల్మాన్ పై 304 సెక్షన్ తో పాటు పలు ఇతర సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాక అతడిపై నమోదైన ఎనిమిది అభియోగాల్లోనూ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. దీంతో అతడికి పదేళ్ల జైలు శిక్ష తప్పదన్న భావన వ్యక్తమైంది. ఇక చిట్టచివరగా కేసును తారుమారు చేసేందుకు యత్నించిన అతడు, ఏకంగా కారును తాను నడపలేదని చెప్పేందుకు పెద్ద సాహసమే చేశాడు. ఇన్నాళ్లు కోర్టు ముందుకు రాని తన కారు డ్రైవర్ ను అతడు న్యాయమూర్తి ముందు నిలబెట్టాడు. కారును తానే నడిపానని, ఇందులో సల్మాన్ తప్పేమీ లేదని డ్రైవర్ న్యాయమూర్తిని బుకాయించే యత్నం చేశాడు. ఈ తరహా కుయుక్తులు న్యాయమూర్తిని ఆగ్రహానికి గురి చేశాయి. అదే సమయంలో సల్మాన్ చేస్తున్న సమాజ సేవను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పదేళ్ల జైలుకు బదులు ఐదేళ్ల జైలు శిక్షనే ఖరారు చేశారు.

  • Loading...

More Telugu News